అది ఒక అందమైన పల్లెటూరు. మనం చూస్తున్న పాశ్చ్యాత్త ధోరణికి దూరంగా నిర్మలంగా ఉన్న ఊరు అది. ఒక అందమైన సాయంత్రాన ఎర్ర బస్సులో అక్కడ దిగాను. దిగిన వెంటనే ఏదో తిన్నాను అనిపించి ప్రయాణ బడలికతో నడుం వాల్చాను. అదీ ఆరుబయట. ప్రొద్దుటే సూర్యుణి లేలేత కిరణాలు మొహం మీద పడుతుండగా నిద్ర లేచి కొట్టుడు పంపులో నీళ్ళు కొట్టుకుని స్నానం గట్రా కానిచ్చి అలా పక్కనే ఉన్న హోటల్లో పుల్లట్లు తిన్నాను. తరువాత పల్లె అందాలు చూడటానికి బయలుదేరా. పచ్చని పంటలు, చేలల్లో దుక్కి దున్నుతున్న మగవారు, వారిని ఉత్సాహపరుస్తూ పాటలు పాడుతూ పని చేస్తున్న పడుచులు.... ఇలా ఊరిని చూస్తూ మెల్లగా గోదారి ఒడ్డుని చేరుకున్నా. అప్పటికి సమయం ఉదయం పది గంటలు ఐనా గోదారమ్మ చల్లని గాలి వల్ల అసలు ఎండే తెలియటం లేదు. కొంతసేపు అక్కడే గడిపి అటుగా వెళ్తున్న ఐసుబండి వాడి దగ్గర పుల్ల ఐసు కొనుక్కుని మెల్లగా తింటూ తిరిగి ఊరు చేరుకున్నా.
మధ్యాహ్నం భోజనం ఎక్కడ చేద్దామా అనుకుంటుండగా నాకు ఆతిధ్యం ఇచ్చిన ఇంటి వాళ్ళు నన్ను అక్కడే భోజనం చెయ్యమని మనం మర్చిపోయిన ఉలవచారు మొదలైన వాటితో అద్భుతమైన విందు పెట్టారు. తిన్నాక కొంతసేపు నడుం వాల్చి మెల్లగా ఊరి సెంటర్లోకి బయల్దేరా. పల్లెటూర్లో సెంటర్ అంటే ఏమిటో మీకు అందరికీ తెలిసే ఉంటుందిగా? అక్కడ మర్రి చెట్టు కింద పిచ్చా పాటి మాట్లాడుకునే ఊరి పెద్దలని చూస్తే ఎందుకో పాత సినిమాలు గుర్తొచ్చాయి. కొంత వాళ్ళ మధ్యలో కూర్చుని తరువాత పక్కనే ఉన్న బండినుండి కమ్మని వాసనలు వస్తుంటే అటువైపు వెళ్ళా. ఆ బండివాడు వేస్తున్న మిరపకాయ బజ్జీలు, చల్ల పుణుకులు చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరాయి. వెంటనే వాటి మీద ఎగబడ్డా.
తరువాత కొంచెం సేపు అక్కడి జనాలతో సుత్తి కొట్టి రాత్రి భోజనం మాంచి నాటు కోడి పలావు లాగించా. దాని రుచి తల్చుకుంటేనే నోరూరుతుంది. ఇంక ఈ రోజుకి ఈ సాహసాలు చాలు అనుకుని ఇంక పక్కేసా. పొద్దుటే అలారం మోగగానే మెలుకువ వచ్చి కళ్ళు నులుముకుని చూస్తే ఇంకేముంది....... ఇదంతా ఒక కల మాత్రమే. మనసుని ఆహ్లాదపరిచే తీయని కల.
Tuesday, November 13, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment